WhatsApp: రెండు ఫోన్లలో ఒకే నెంబర్‌తో వాట్సాప్‌.. ఎలా పనిచేస్తుందంటే?

తాజాగా రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకే వాట్సాప్‌ వాడటానికి మల్టీ డివైజ్‌ సపోర్ట్‌లో భాగంగా ‘కంపానియన్‌ మోడ్‌’ ఫీచర్‌ను తీసుకోస్తున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది.

Published : 10 May 2022 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునేలా ‘మల్టీడివైజ్ సపోర్ట్‌’ (multi-device support) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను రెండు స్మార్ట్‌ఫోన్లలో వాడే సదుపాయాన్ని కూడా వాట్సాప్‌ పరిచయం చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై కీలక ముందడుగు పడినట్లు కనిపిస్తోంది. తాజాగా మల్టీ డివైజ్‌ సపోర్ట్‌లో భాగంగా ‘కంపానియన్‌ మోడ్‌’ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. దీనికి సంబంధించి స్క్రీన్‌షాట్‌ను కూడా విడుదల చేసింది.

వాట్సాప్‌ ప్రైమరీ ఖాతా నుంచి మరో నాలుగు డివైజ్‌ (ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌)లలో లాగిన్‌ అయ్యేలా ‘మల్టీ డివైజ్‌ సపోర్ట్‌’ ఫీచర్‌ పనిచేస్తోంది. దీనిలో మార్పులు చేస్తూ తాజాగా రెండు స్మార్ట్‌ఫోన్లు/టాబ్లెట్లలో వాట్సాప్‌ యాక్టివ్‌ చేయడానికి ‘కంపానియన్‌ మోడ్‌’ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రైమరీ ఖాతా నుంచి సెకండరీ డివైజ్‌లో వాట్సాప్‌ను లింక్‌ చేయడానికి ఇది పనిచేయనుంది. దీంతో సెకండరీ ఫోన్‌లో వేరే నెంబర్‌తో వాట్సాప్‌ వాడుతున్నట్లయితే ఈ ఫీచర్‌ను యాక్టివ్‌ చేయగానే ఆ నెంబర్‌తో ఉన్న ఖాతా లాగౌట్‌ అవుతోంది. దీనివల్ల ఇంతకుముందు ఖాతాలోని డేటా (మెసేజెస్‌, మీడియా ఫైల్స్‌) మొత్తం డిలీట్‌ అవుతుంది.

లాగిన్‌ అయిన సెకండరీ ఖాతాకు డేటా సేవింగ్‌ కోసం గూగుల్‌ డ్రైవ్‌ నుంచి బ్యాకప్‌ పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని.. త్వరలో యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వాబీటాఇన్ఫో పేర్కొంది. అయితే, రెండు స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ కనెక్ట్ చేసినప్పుడు యూజర్ డేటాకు ఎలాంటి భద్రత కల్పిస్తుందనే దానిపైనా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇప్పటివరకు ఒకే ఫోన్‌లో ఒకే నంబర్‌తో రెండు వాట్సాప్‌లు వాడే వీలు ఉండేది కాదు. కానీ, ఈ ఫీచర్‌తో ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో ఒకే వాట్సాప్‌ వాడే అవకాశం యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని