WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు బంపరాఫర్‌.. ఆ నంబర్‌ ఇక డబుల్‌!

గ్రూప్‌లో సభ్యుల సంఖ్యను పెంచుతున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఒక గ్రూప్‌లో 256 మంది సభ్యుల పరిమితి మాత్రమే ఉండగా.. దాన్ని 512కు పెంచుకోవచ్చు.

Updated : 09 May 2022 20:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను మరింత ఆకర్షించడానికి వాట్సాప్‌ ఎల్లప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ తీసుకురావడానికి సన్నాహలు చేస్తున్నట్లు వెల్లడించింది. వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యుల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో 256 మంది సభ్యుల పరిమితి మాత్రమే ఉండగా.. దాన్ని 512కు పెంచుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. త్వరలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెస్తామని వాట్సాప్‌ తన బ్లాగ్‌ పోస్టులో వివరించింది.

వాట్సాప్‌ ఇప్పటికే కమ్యూనిటీ గ్రూప్‌ చాట్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిసాయంతో వాట్సాప్ యూజర్లు సమాచారాన్ని ఎక్కువమందితో పంచుకునే వీలు ఉంటుంది. ఇదేకాకుండా ఇటీవలే లొకేషన్‌ స్టిక్కర్‌, చాట్‌ లిస్ట్‌ స్టేటస్ అప్‌డేట్ వంటి ఫీచర్లను వాట్సాప్‌ పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది.

తాజాగా ఎమోజీ రియాక్షన్‌ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసినట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌లో స్వయంగా తెలిపారు. దీంతో వాట్సాప్ యూజర్లు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలోనే వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌కు ఎమోజీలతో తమ స్పందన తెలియజేయవచ్చు. వాట్సాప్‌లో ఇతరుల స్టేటస్‌ అప్‌డేట్‌పై క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్‌ మీద పలు రకాల ఎమోజీ రియాక్షన్స్‌ కనిపిస్తాయి. ఇంతకుముందు వాట్సాప్‌లో టెక్ట్స్‌ మెసేజ్‌లు, డాక్యుమెంట్స్‌తోపాటు మీడియా ఫైల్స్‌నూ షేర్ చేసుకునేందుకు 100 ఎంబీ సైజు పరిమితులు ఉండేవి. దీన్ని ఇటీవల 2జీబీ వరకు పెంచుతున్నట్లు వాట్సాప్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని