విచారిస్తారా.. అప్పగిస్తారా..!

ఉక్రెయిన్‌ తరఫున పోరాడుతూ చివరకు రష్యాకు లొంగిపోయిన సైనికులు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందా, యుద్ధ ఖైదీల మార్పిడి కింద తిరిగి మాతృ దేశానికి వెళ్లగలుగుతారా అనేది తేలడం

Updated : 20 May 2022 06:28 IST

రష్యాకు చిక్కిన ఉక్రెయిన్‌ దళాలపై అస్పష్టత 

ఖైదీల మార్పిడికి రెడ్‌క్రాస్‌ దౌత్యం 

డాన్‌బాస్‌లో కొనసాగుతున్న పోరు 

నాటోలో కొత్త దేశాలను స్వాగతించిన అమెరికా 

మాస్కో, కీవ్‌: ఉక్రెయిన్‌ తరఫున పోరాడుతూ చివరకు రష్యాకు లొంగిపోయిన సైనికులు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందా, యుద్ధ ఖైదీల మార్పిడి కింద తిరిగి మాతృ దేశానికి వెళ్లగలుగుతారా అనేది తేలడం లేదు. అజోవ్‌ రెజిమెంట్‌కు చెందిన పోరాట దళాలను తిరిగి అప్పగించడాన్ని నిషేధించే తీర్మానంపై రష్యా పార్లమెంటు చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది. మేరియుపొల్‌ నగరంలోని బంకర్లలో ఉంటూ తమతో పోరాడి చివరకు లొంగు‘బాట’లోకి వచ్చిన అజోవ్‌ రెజిమెంట్‌ సైనికులు 1,750 మంది వరకు ఉంటారని రష్యా తాజాగా ప్రకటించింది. వీరిలో కొందరిని రష్యా అనుకూల వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు తరలించారు. మరికొందరిని చికిత్స కోసం ఆసుపత్రులకు పంపించారు. ఉక్రెయిన్‌ సైనికుల వద్దకు వెళ్లేందుకు రెడ్‌క్రాస్‌కు వెంటనే అవకాశం కల్పించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ విజ్ఞప్తి చేసింది. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో అనేక చట్టవిరుద్ధ శిక్షలు అమలు చేశారనీ, అజోవ్‌స్తల్‌లో పట్టుబడినవారికి ఇలా జరగకుండా చూడాలని పేర్కొంది. వారిని యుద్ధఖైదీలుగా గుర్తించేందుకు రెడ్‌క్రాస్‌ ప్రయత్నాలు చేస్తోంది. అజోవ్‌ రెజిమెంట్‌ మొత్తాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని రష్యా ప్రాసిక్యూటర్లు తమ సుప్రీంకోర్టును కోరారు. 

అక్కడ పోరాటం ముగిసినట్లే 

కీలక నగరాల్లో ఒకటైన ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయిలో పట్టు సాధించడంతో అక్కడ పోరు ఇక ముగిసినట్లేనని భావిస్తున్నారు. డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా దాడుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మేరియుపొల్‌లో అధికారుల్ని కొట్టడం, కొందరికి విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం, ఇళ్లను దోచుకోవడం వంటివి రష్యా సైనికులు చేస్తుండడంపై క్రెమ్లిన్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రష్యా సైనికుల దాష్టీకాలపై ఇప్పటికే ఒక కేసులో విచారణ జరుగుతుండగా మరో 40 కేసులను కూడా త్వరలో చేపట్టనున్నారు. తమ సైనికుల్ని హీరోలుగా చెబుతూ వచ్చి, చివరకు లొంగిపొమ్మని ఆదేశించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై కొన్ని వర్గాల్లో విమర్శలు మొదలయ్యాయి. ఖైదీల మార్పిడి విషయంలోనూ జెలెన్‌స్కీకి నిరాశే మిగులుతుందని మేధోమథన సంస్థ అధిపతి వొలొదిమిర్‌ ఫెసెన్కో అభిప్రాయపడ్డారు. ‘మా దేశం నుంచి రష్యా సేనలు పూర్తిగా వైదొలగేవరకు కాల్పుల విరమణ ప్రతిపాదనను తీసుకురావద్దు. మాకు పూర్తి స్వేచ్ఛను కల్పించేవరకు ఆయుధాలు, ఆంక్షలే మా చర్చల బృందం అనుకోండి’ అని జెలెన్‌స్కీ సలహాదారుడు పొదొల్‌యాక్‌ చెప్పారు. 

నాటోలో చేరిక ఎవరికీ ముప్పేమీ కాదు: బైడెన్‌ 

స్వీడన్, ఫిన్లాండ్‌లను నాటోలో చేర్చుకోవద్దని టర్కీ మరోసారి అభ్యంతరం లేవనెత్తింది. తమ భద్రతకు ముప్పుగా భావిస్తున్న ఖుర్దు తీవ్రవాదులకు ఆ రెండు దేశాలూ ఆశ్రయం కల్పిస్తున్నాయని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలకు సమాధానం లభించేవరకు సభ్యత్వాల విషయంలో ముందడుగు పడదని ఎర్దోగన్‌ అధికార ప్రతినిధి చెప్పేశారు. శక్తిమంతమైన నాటోలో చేరాలని దరఖాస్తు చేసిన రెండు దేశాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్వాగతించారు. స్వీడన్‌ ప్రధాని మగ్దలీనా ఆండర్సన్, ఫిన్లాండ్‌ అధ్యక్షుడు సౌలీ నీనిస్తోలతో శ్వేతసౌధంలో కరచాలనం చేసి, అభినందనలు తెలిపారు. కూటమిలో కొత్త దేశాలు చేరడం ఏ దేశానికీ ముప్పు మాత్రం కాదన్నారు. వీటి చేరికకు ఆమోదం తెలపాల్సిందిగా సెనేట్‌ను కోరినట్లు చెప్పారు. కీవ్‌లో అమెరికా తమ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో తమ రాయబారిగా బ్రిడ్జెట్‌ బ్రింక్‌ను నియమించాలని అమెరికా సెనేట్‌ ఏకగ్రీవంగా నిర్ణయించింది. 

క్షమాపణలు చెప్పిన రష్యా సైనికుడు 

ఉక్రెయిన్‌లో 62 ఏళ్ల సాధారణ పౌరుడిని కాల్చిచంపినట్లు విచారణలో అంగీకరించిన 21 ఏళ్ల రష్యా సైనికుడు ఆ నేరాన్ని అంగీకరించడంతో పాటు తన చర్యను క్షమించాలని మృతుడి భార్యను కోరారు. పై అధికారుల ఆదేశంతోనే తాను ఆమె భర్తను కాల్చాల్సి వచ్చిందని విచారణలో చెప్పారు. ‘మీరు క్షమించలేరని తెలుసు. కానీ క్షమించాల్సిందిగా ప్రాధేయపడుతున్నా’ అని అన్నారు. తన భర్తను చంపిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష పడాలని, అయితే ఖైదీల మార్పిడి కింద అతడిని అప్పగించినా అభ్యంతరం లేదని ఆమె బదులిచ్చారు. 

యుద్ధం విస్తరిస్తుందేమో: ఫ్రాన్స్‌

ఉక్రెయిన్‌లో మొదలైన యుద్ధం సమీప భవిష్యత్తులో చుట్టుపక్కల దేశాలకు విస్తరిస్తుందేమోనని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దోవాలో ఘటనల్ని ఉటంకిస్తూ ఆ దేశ అధ్యక్షుడు వద్ద ఆయన ఈ వ్యాఖ్య చేశారు. 

* ఉక్రెయిన్‌లో అణు ఇంధన కేంద్రాల భద్రతకు 20 లక్షల డాలర్ల సాయాన్ని ‘అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ’కు ఇవ్వబోతున్నట్లు జపాన్‌ ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని