సమీప ఆవాసయోగ్య గ్రహం అన్వేషణలో..

సౌర కుటుంబానికి సమీపంలో నివాసయోగ్య గ్రహాల జాడ కనిపెట్టేందుకు చైనా సన్నద్ధమవుతోంది! భూమి నుంచి 32 కాంతిసంవత్సరాల దూరం పరిధిలో.. అంతరిక్ష టెలిస్కోపు సాయంతో ఈ

Published : 20 May 2022 05:22 IST

 కీలక ప్రాజెక్టుకు చైనా శాస్త్రవేత్తల ప్రతిపాదనలు 

బీజింగ్‌: సౌర కుటుంబానికి సమీపంలో నివాసయోగ్య గ్రహాల జాడ కనిపెట్టేందుకు చైనా సన్నద్ధమవుతోంది! భూమి నుంచి 32 కాంతిసంవత్సరాల దూరం పరిధిలో.. అంతరిక్ష టెలిస్కోపు సాయంతో ఈ అన్వేషణ కొనసాగించాలని ఆ దేశ శాస్త్రవేత్తలు తాజాగా ప్రతిపాదించారు. ఇందుకోసం ‘సౌరకుటుంబం ఆవలి సమీప నివాసయోగ్య గ్రహం (చెస్‌)’ పేరుతో ఈ ప్రత్యేక ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చారు. సూర్యుడి వంటి దాదాపు 100 నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలపై ఇందులో దృష్టిసారించనున్నారు. ఈ అన్వేషణలో సుమారు 50 భూమి వంటి గ్రహాలు లేదా పుడమితో పోలిస్తే ఎక్కువ పరిమాణమున్న గ్రహాలను కనుగొనవచ్చని వారు ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. విశ్వంలో మనుషులు ఏకాకులో కాదో తెలుసుకోవడంతో పాటు గ్రహాలు నివాసయోగ్యంగా ఎలా తయారవుతున్నాయన్న సంక్లిష్ట విషయాన్ని అర్థం చేసుకునేందుకు చెస్‌ దోహదపడే అవకాశముంది. నిజానికి సౌర కుటుంబం బయట ఇప్పటికే 5 వేలకు పైగా గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో దాదాపు 50 గ్రహాలు భూమి తరహాలోనే ఆవాసయోగ్య జోన్‌లలో కనిపించాయి. అయితే వాటిలో అత్యధికం.. పుడమి నుంచి వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. చెస్‌ ప్రాజెక్టు పట్టాలెక్కితే- సూర్యుడి సమీపంలోని నక్షత్రాల పరిధిలో నివాసయోగ్య గ్రహాల జాడ కనిపెట్టేందుకు ప్రత్యేకంగా తలపెట్టిన తొలి ప్రాజెక్టు ఇదే అవుతుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని